ఎవరూ కావాలని జట్టుకు నష్టం చేకూర్చేపనిని చేయరు





పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవడం కన్నా, రవీంద్ర జడేజా కారణంగా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అవుటైన తీరే అభిమానులను ఎంతగానో నిరాశకు గురి చేసింది.
అనవసర పరుగు కోసం జడేజా ఇచ్చిన పిలుపుతో క్రీజుని వదిలిన హార్ధిక్ పాండ్యా రనౌట్ అయిన సంగతి తెలిసిందే. జడేజా కారణంగానే తాను రనౌట్ అయ్యానంటూ పాండ్యా బాహబాటంగానే అసహనం వ్యక్తం చేశాడు.
అనవసరంగా రనౌట్ అయ్యానంటూ తిట్టుకుంటూ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మమ్మల్ని మేము మోసం చేసుకున్నామంటూ ఒక ట్వీట్ కూడా చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెను సంచలనమే సృష్టించిందని చెప్పాలి.
అయితే ఏమైందో ఏమో గానీ వెంటనే పాండ్యా ఆ ట్వీట్‌ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రనౌట్ తర్వాత తాను ప్రవర్తించిన తీరుపై పాండ్యా వివరణ కూడా ఇచ్చాడు. తాను ఆ రకంగా ప్రవర్తించి ఉండాల్సింది కాదని పేర్కొన్నాడు.
ఈ రనౌట్‌పై తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు. బుధవారం తన భార్య రీవా సోలంకీతో కలిసేందుకు ముంబైకి వచ్చిన జడేజా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. నిజాయితీగా చెప్పాలంటే ఆట జరుగుతున్న పరిస్థితిని క్రికెట్ ప్రేమికులు అర్ధం చేసుకోవాలని చెప్పాడు.
'కొన్నిసార్లు ఆ తరహా రనౌట్లు అనేవి జరగడం సర్వసాధారణం. ఎవరూ కావాలని జట్టుకు నష్టం చేకూర్చేపనిని చేయరు. అలాగే నేను కూడా కావాలని హార్దిక్‌ను అవుట్ చేయలేదు. రనౌట్ అనేది గేమ్‌లో భాగం. దాని కోసం విచారించాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకోవడం లేదు' అని జడేజా పేర్కొన్నాడు.
ఇదిలా ఉంచితే, తన తదుపరి టార్గెట్ శ్రీలంకతో జరిగే సిరీస్ అని జడేజా తెలిపాడు. ఆ సిరీస్‌లో తనను మరోసారి నిరూపించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు జడేజా స్పష్టం చేశాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జులై 26 నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
లంక పర్యటనలో ఆతిథ్య జట్టులో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కూడిన సిరిస్ ఆడనుంది. లంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో జడేజా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు