రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు

 రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు పార్లమెంటులో గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు కోసం లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని రాష్ర్టాల నుంచి బ్యాలెట్ బాక్సులను పకడ్బందీ భద్రత నడుమ ఢిల్లీకి తరలించారు. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం ఎనిమిది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రతి రౌండ్‌లో లెక్కింపు ముగిసిన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ కూటమి తరఫున బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ కూటమి తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పోటీ పడ్డారు. ఈ నెల 18న పార్లమెంటుతో సహా అన్ని రాష్ర్టాల రాజధానుల్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభల ఎంపీలు 776 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 99.14శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలుపొందిన అభ్యర్థికి లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందజేస్తారు.
25న బాధ్యతలు స్వీకరించనున్న నూతన రాష్ట్రపతి

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 23న సాయంత్రం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీలవారీగా ఎంపీల, ఎమ్మెల్యేల ఓట్ల విలువ గణాంకాలను పరిశీలిస్తే రామ్‌నాథ్ కోవింద్ గెలుపొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు