ఈ నెల 23వ తేదీ నుండి ట్యాబ్లేట్ కంప్యూటర్ ద్వారా ఓటర్ల నమోదు .

ట్యాబ్లేట్ కంప్యూటర్ ద్వారా ఓటర్ల నమోదు


ఈ నెల 23వ తేదీ నుండి నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ముమ్మర ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు చేపడుతారని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి సారిగా ఓటర్ల నమోదుకు వెళ్లే సిబ్బందికి ట్యాబ్లేట్ పిసిలను అందజేస్తున్నామని, ఇంటి వద్దే ఓటర్ల ఫోటోను తీసి జీపీఎస్ కు అనుసంధానం చేయడం వల్ల ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు స్థానంలేదని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నమోదు చేస్తున్నామని, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లు టాబ్లేట్ కంప్యూటర్ల ద్వారా జరిగే ఓటర్ల నమోదును సరిచూస్తారని వివరించారు. ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక పర్యవేక్షణ అధికారిని నియమించి బూత్లేవల్ అధికారుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత పారదర్శకంగా సజావుగా కొనసాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా కోరామని వివరించారు. ఈ నెల 23 నుండి నిర్వహించే ఓటర్ల జాబితా సవరణకు డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సహా బూత్లేవల్ అధికారులు ప్రతిరోజు ఉదయం 8గంటల నుండి రాత్రి 7గంటల వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని కమిషనర్ వివరించారు. బూత్లేవల్ అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు ఇల్లు మారడం, మరణించడం, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండే అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారని వివరించారు. ఎక్కడైన ఇల్లు తాళం వేసి ఉంటే ఆ ఇంటిపై బూత్లేవల్ అధికారి పేరు, సెల్ నెంబర్ వివరాలతో కూడిన స్టిక్కర్ను డోర్కు అంటించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి వచ్చే ఎన్నికల సిబ్బందికి ఓటర్ల జాబితా సవరణకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగర ఓటర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు