తెలంగాణ రవాణాశాఖ ఆర్‌టీఏ-ఎం వ్యాలెట్‌కు మరిన్ని హంగులు

వివిధ రాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణ రవాణాశాఖ ఆర్‌టీఏ-ఎం వ్యాలెట్‌కు మరిన్ని హంగులు చేరబోతున్నాయి. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల(ఆర్‌సీ)కు మాత్రమే పరిమితమైన వ్యాలెట్ ద్వారా వాహనదారులు మరి న్ని సేవలు పొందే అవకాశముంది. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాల నివారణకు ప్రవేశపెట్టిన 12 పాయింట్ల విధానం పక్కాగా అమలు జరిగేలా రవా ణా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్త కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ విధానానికి సంబంధించిన సమాచారాన్ని వాహనదారులకు చేరువ చేసేందుకు ఎం-వ్యాలెట్‌లో ప్రత్యేక ఫీచర్ జోడించనున్నారు. అదేవిధంగా ఉల్లంఘన సమాచారాన్ని ఫొటో రూపంలో అందించనున్నారు. వ్యాలెట్ లేని వారికి లైసెన్సులో ఉన్న రిజిస్టర్ ఫోన్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించనున్నారు.
ఇప్పటివరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిపితే వాహన యజమానికి బండి నంబర్ ఆధారంగా చలాన్ పంపేవారు. ఫలితంగా తప్పు చేసిన డ్రైవర్ తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి మాత్రమే శిక్ష పడాలనే ఉద్దేశంతో 12 పాయింట్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాన్ని నడుపడం, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌స్పీడ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వంటివి చేస్తూ పట్టుబడితే పోలీసులు ఫైన్ విధిస్తారు. సంబంధిత చలాన్‌ను ట్రాన్స్‌పోర్ట్ సర్వర్‌కు పంపిస్తారు. ఈ సమాచారం అందగానే ఉల్లంఘన తీవ్రతను బట్టి పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 5 పాయింట్లు వేస్తారు. ఇలా రెండేండ్లలో 12 పాయింట్లు చేరుకోగానే ఆర్‌టీవోకు అలర్ట్ వెళ్తుంది. దీని ఆధారంగా ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి నోటీసులు జారీచేస్తారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతారు. వివరణ సరిగ్గా లేకుంటే తీవ్రతను బట్టి లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఎం-వ్యాలెట్ ద్వారా ఎవరికి వారు సొంతగా పాయింట్లు చెక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు