జాన్ జోసెఫ్‌ను జీఎస్‌టీ డైరెక్టర్ గా నియామకం
దేశవ్యాప్తంగా జులై 1 నుంచి వస్తు, సేవలపన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ నుంచి తప్పించుకునే వారిపై నిఘా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా సీనియర్ ఉన్నతాధికారి జాన్ జోసెఫ్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్(డీజీ జీఎస్‌టీఐ)కు నూతన అధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఆయన త్వరలోనే పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. జోసెఫ్ 1983 భారతీయ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)కు చెందిన అధికారి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక శాఖల్లో ఆయన పనిచేశారు. అంతేకాకుండా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌గా కూడా విధులు నిర్వహించారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్(డీజీసీఈఐ)ను జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక డీజీ జీఎస్‌టీఐగా పేరు మార్చారు. పన్నుల పరిశీలన, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత తదితర అంశాలను ఇది పర్యవేక్షిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యుడిగా ఆర్‌కె మహాజన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. డీజీ జీఎస్‌టీఐ కొత్త అధిపతి వచ్చే వరకూ ఆయనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Comments
Post a Comment