లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం అధికారులకు చంద్రబాబు ఆదేశం
అమరావతి: తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువుల్ని కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20లక్షల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఆమెకు అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు వెలగపూడిలోని సచివాలయానికి లక్ష్మీప్రసన్నను జేసీ సోదరులు మంగళవారం తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో మాట్లాడిన చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివానని చెప్పిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రూప్-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు.

Comments
Post a Comment